Loading...

4, ఫిబ్రవరి 2013, సోమవారం

నేడు తుది విడత సహాకార సమరం

విశాఖపట్నం, చైతన్యవారధి: సహకార ఎన్నికల సమరంలో తుది విడత పోరుకు తెర లేచింది. సోమవారం జరగనున్న మలి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ పదవిని చేపట్టేదెవరో తేల్చే ప్రక్రియలో ఈ ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. తుది దశలో యలమంచిలి డివిజన్‌లోని 42
పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరగబోతున్నాయి. డివిజన్‌లోని 54 పీఏసీఎస్‌ల్లో పదింటికి అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో రెండింట్లో ఎన్నికలను ప్రభుత్వం అడ్డగోలుగా వాయిదా వేసింది. దాంతో మిగిలిన 42 సంఘాల పరిధిలోని 428 సెగ్మెంట్లలో సోమవారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 1,066 మంది పోటీలో ఉన్నారు. ఇందు కోసం 49 పోలింగ్ స్టేషన్లు, 428 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం75,389 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు 1376 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. చోడవరంలో జెడ్పీ హైస్కూల్, నర్సీపట్నంలో ఆర్‌సీఎం స్కూల్, యలమంచిలిలో గు రప్ప కళ్యాణమండపాలలో పోలింగ్ సిబ్బందికి ఆదివారం ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. చోడవరంలోని శిబిరాన్ని డీసీవో ఎం.సూర్యభగవాన్ పర్యవే క్షించారు. 13 అత్యంత సమస్యాత్మక, 26 సమస్యాత్మక గ్రామాలుగాను గుర్తించారు. కొక్కిరాపల్లి, దిమిలి, రాంబిల్లి, దుప్పుతూరు,కొండకర్ల, శ్రీరాంపురం, లక్కవరం, శృంగవరం, నాతవరం, జానకీరాంపురం, కొయ్యూరు, కొత్తకోట, వడ్డాది సొసైటీల పరిధిలోని ప్రాంతాలను అతి సమస్మాత్మకమైనవిగా గుర్తించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రాంతాల్లో 200 మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించారు. పోలింగ్ ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు జరుగుతుంది. భోజన విరామం అనంతరం ఓట్లు లెక్కిస్తారు. సాయంత్రం 5 గంటలు దాటాక ఫలితాలు వెల్లడిస్తారు. గెలుపోందిన వారికి వెంటనే ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. సమయం ఉంటే అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. కాకుంటే నోటిఫికేషన్ ఇచ్చి మరుసటి రోజు ఎన్నిక నిర్వహిస్తారు. తొలి విడత ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో మలివిడత ఎన్నికలపై రాజకీయ పార్టీలు దృష్టిసారించాయి. పార్టీ ప్రాతిపదిక లేని ఎన్నికలే అయినా ప్రతిష్ట కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. అయితే పార్టీల అడ్డంకులు లేని కారణంగా ఎవరు ఎవరితో చేతులు కలుపుతున్నారో అర్ధం కావడం లేదు. ఎన్నికల కారణంగా గ్రామాల్లో వాతావరణం వేడెక్కింది. పరిస్థితిని గమనిస్తే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం తలపులోకి వస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి