Loading...

28, ఏప్రిల్ 2013, ఆదివారం

రుతుపవనాలు సాధారణం

న్యూఢిల్లీ: ఈ సంవత్సరంలో రుతుపవనాలు సాధారణమేనని కేంద్ర మంత్రి ఎస్‌ జైపాల్‌ రెడ్డి వివరించారు. ఈ మేరకు వాతావరణ శాఖ నిపుణులు అందించిన నివేదిక కేంద్రానికి అందిందని ఆయన తెలిపారు. నాలుగేళ్ల పాటు కరవు భారత దేశాన్ని పీడించిందని, కానీ ఈ సంవత్సరం మాత్రం రైతులు లాభపడనున్నారని ఆయన అన్నారు.
గత వారంలో తొలి వాతావరణ అంచనాలు వెలువడ్డాయని, ఈ ఏడు పంట అద్భుతంగా పండనుందని, ప్రజలకు సైతం కాస్తంత తక్కువ ధరలకు వస్తు ఉత్పత్తులు దొరకనున్నాయని ఆయన అన్నారు. శుక్రవారం నాడు జైపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ యేడు రుతుపవనాలు సాధారణ స్థాయిలోనే వుండనున్నాయని అన్నారు.
దేశంలోని పంట భూమిలో 55 శాతం వర్షాధారమేనని, ఈ భూమికి వానలు మేలు కలిగించనున్నాయని భావిస్తున్నామని తెలిపారు. జూన్‌ - సెప్టెంబర్‌ మాసాల్లో 98 శాతం సరాసరి వర్షపాతం నమోదు కానుందని ఆయన వివరించారు. 50 సంవత్సరాల సరాసరి సగటు 96 నుంచి 104 శాతం మధ్యన వర్షపాతం వుంటుందని నిపుణులు వెల్లడించినట్టు తెలిపారు. 2004లో, 2009లో దేశాన్ని అతివృష్టి, అనావృష్టిలు పీడించాయని ఆయన గుర్తు చేశారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో 15 శాతంగా వున్న వ్యవసాయ రంగం 80 కోట్ల మందికి ఉపాధిగా వున్నదని తెలిపారు. ప్రస్తుతం 9 శాతానికి దగ్గరగా వున్న ద్రవ్యోల్బణం తగ్గేందుకు కూడా ఈ సంవత్సరం వర్షాలు సహకరించనున్నాయని ఆయన అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి