Loading...

1, అక్టోబర్ 2013, మంగళవారం

సబ్బం హరికి జగన్ ఝలక్

హైదరాబాద్: దాదాపు పదహారు నెలల క్రితం.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే దృశ్యాన్ని గంటల కొద్దీ టీవీలో లైవ్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆందోళన చెందుతున్న జగన్ కుటుంబసభ్యులకు అండగా నిలబడిన వ్యక్తుల్లో ఒకరు రాష్ట్ర ప్రజలను విపరీతంగా ఆకర్షించారు.ఆయన కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి. అప్పటికీ.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆయన అంత బాహాటంగా జగన్ ఫ్యామిలీకి మద్దతు ఇవ్వటం సంచలనం సృష్టించింది. జగన్ పార్టీలో చేరబోతున్నందునే ఆయన అంత తెగించారని అప్పట్లో విశ్లేషణలు కూడా వచ్చాయి.
విచిత్రమేమంటే.. ఆయన జగన్ పార్టీ చేరలేదు. అలా అని జగన్ అండ్ కో తో సంబంధాలు మానుకోలేదు. రెగ్యులర్ గా టచ్ లో ఉండే ఆయన తాజాగా జగన్ తో తెగ తెంపులు చేసుకున్నారు. కాదు.. కాదు..జగనే ఆయన్ను దూరం పెట్టేందుకు డిసైడ్ అయ్యారు. నమ్ముకున్నోళ్ల  కోసం ఏమైనా చేస్తానని చెప్పే జగన్.. ఆ మాట మీద మాత్రం అస్సలు నిలబడరు. ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు పడ్డానో అంటూ మెలోడ్రామా పండించే ఆయన.. తన కుటుంబం కోసం, పార్టీ కోసం త్యాగాలు చేసే నేతలకు మాత్రం ఏమీ చేయరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పిచ్చిగా అభిమానించే మాజీమంత్రి కొండాసురేఖ దంపతులు.. జగన్ మీద కూడా అదే అభిమానాన్ని ప్రదర్శించారు. జగన్ పట్ల తమ వైఖరిని తేల్చుకోలేక కాంగ్రెస్ నేతలు పలువురు మల్లగుల్లాలు పడుతున్న సమయంలో డేర్ గా.. తన మంత్రి పదవికి సైతం త్యాగం చేసిన కొండా సురేఖకు చివరకు మిగిలింది అవమానాలే. అలా.. నమ్మినవాళ్లను..అండగా ఉంటామని నిలిచిన వారిని గెంటేసే వైఖరి జగన్ సొంతం. తాజాగా ఆయన ద్వేషించే వారి జాబితాలో సబ్బం హరి కూడా చేరారు.ఆసక్తికరమైన అంశం ఏమంటే.. జగన్ ను సీబీఐ అరెస్టు చేసినప్పుడు ఆ విషయాన్నిమీడియాకు ప్రకటించింది సబ్బం హరే. అలాంటి ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తేల్చి చెబుతున్నారు. చాలా నెలల తర్వాత బయటకు వచ్చిన జగన్..పార్టీని బలోపేతంపై దృష్టి సారిస్తారని భావించారు. వెంట ఉన్న బలగాన్ని సైతం ఎందుకు చేజార్చుకుంటున్నారంటే అది జగన్ అనుభవలేమి వల్లనేనన్న సమాధానం వినిపిస్తుంది. దీనికి కారణం ఏమిటి? అంటే ఆసక్తికరమైన వాదన వినిపిస్తోంది. 2014 ఎన్నికల తర్వాత ఏర్పడే యూపీఏ-3 కు జగన్ మద్దతు ఇస్తారన్న అభిప్రాయం వ్యక్తం చేయటమే సబ్బం హరి తప్పుగా చెబుతున్నారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ మధ్య జరిగిన లోగుట్టు ఒప్పందం సబ్బం హరి వల్లే బయటకు వచ్చిందన్న అభిప్రాయంతో జగన్ ఉన్నారు. అందుకే ఆయనను దూరం పెట్టాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. జగన్ జైలు నుంచి విడుదలైన సమయంలో.. త్వరలో జగన్ ను కలిసి కాంగ్రెస్ కు రాజీనామాపై ప్రకటన చేస్తానని సబ్బం హరి చెప్పారు. ఆయన అలా చెప్పిన తర్వాతి రోజే సబ్బం హరితో తమకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ప్రతికూల ప్రకటన వెలువడటం విశేషం. వైఎస్ మీద ఉన్న అభిమానంతో జగన్ ను నమ్ముకుంటే నట్టేట ముంచేయటం ఖాయమన్న వాదన సబ్బం హరి ఉదంతంతో మరోసారి రుజువైంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి