Loading...

1, నవంబర్ 2013, శుక్రవారం

ఏంటో ఈ అఖిలపక్షం కిరికికి.....

చైతన్యవారధి: ఇన్నాళ్లు చంద్రబాబు వంటి వారు అఖిలపక్షం సమావేశం పెట్టాలని గగ్గోలు పెట్టినా ఇప్పుడు ఆ అవసరం లేదని కుండబద్దలు కొట్టిన కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టుండి ఆ సమావేశం పెట్టాలని ఎందుకు నిర్ణయించారు. ఇప్పటికే పలుసార్లు అఖిలపక్ష సమావేశాలు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నాం, ఇంకా  ఆ సమావేశం పెట్టాల్సిన అవసరం లేదన్న వాళ్లు ఇప్పుడు పెడుతున్నారంటే, అది కూడా తెలంగాణ విషయంలో పంపకాల దాకా వెల్లాక. అందుకే ఈ సమావేశం నిర్వహణ వెనుక కాంగ్రెస్ అసలు ఎజెండా వేరే ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇంతకీ అదేంటి, కాంగ్రెస్ మదిలో ఉన్న అసలు ఆలోచన ఏంటి అన్నదానిపైనే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదేంటంటే మంత్రుల బృందం ఈ నెల 9న నిర్వహించే సమావేశం దాదాపు ఆఖరుదని, ఆ రోజు తెలంగాణ నిర్ణయం అయిపోతుందని అంటున్నారు. ఆతరువాత నవంబర్ 15 న అసెంబ్లీకి అభిప్రాయ సేకరణ కోసం అది రావడం, వెంట  వెంటనే మిగిలిన ప్రక్రియ డిసెంబర్ ఏడులోగా పూర్తి చేసి సోనియా పుట్టిన రోజు అంటే డిసెంబర్ 9న తెలంగాణను 29వ రాష్ట్రంగా ప్రకటించడం జరిగిపోతుందట, ఇది కాంగ్రెస్ ఇప్పటికే డిసైడ్ చేసుకున్న ఎజెండా అన్నది అందరు అనుకుంటున్న మాట.
అయితే ఆలోపు అఖిలపక్షం పెడుతున్నారు, ఈ సమావేశంలో ఇప్పుడు విభజనను పైకి వ్యతిరేకిస్తున్నారు అన్న వారంతా కొంపదీసి సమావేశంలో కూడా విభజనను వద్దంటే తెలంగాణా ఏర్పాటు ఆపుతుందా కాంగ్రెస్ అన్న అనుమానం అందరిలో కలగడం సహజమే. అలా అంటే కూడా తెలంగాణ ఏర్పాటు అంతా పూర్తి చేసాకా ఎలా ఆపుతుంది అన్నది కూడా అందరిలో సహజంగా కలిగే సందేహమే. అంతెందుకు విభజన ప్రక్రియ సరిగా లేదని పార్టీలన్నీ అంటున్నాయి కాబట్టి అది ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఈ సమావేశం పెడుతున్నారని అనుకోవచ్చు.
అలాంటప్పుడు తాననుకున్న విదంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను, పంపకాలను వేగంగా చేసుకుపోవడం ఎందుకు, దానిని ఆపేసి సమావేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాక వారి సూచనల మేరకు మళ్లీ పంపకాలు చేయొచ్చుకదా... అంటే అది కాదనిపిస్తోంది. కారణం అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి ముందు టాస్క్ ఫోర్స్ తో పాటు వివిధ శాఖల అధికారులు పంపకాలు పూర్తి చేసి నివేదిక ఇవ్వనున్నారు.
మరెందుకు ఈ సమావేశం అనేదే అందరి మదిని వేదిస్తున్న ప్రశ్న. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే రాష్ట్ర విభజన ప్రక్రియపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి రాష్ట్రంలోని టిడిపి, వైఎస్సార్ సిపి వంటి ప్రధాన పార్టీలు తమ అభిప్రాయాలను  తెలియచేయడం లేదు, దాదాపు అవన్నీ జిఓఎం ను అవి బహిష్కరించినట్లే. ఇలా అఖిలపక్షం పేరుతో వారి అభిప్రాయాలను తీసుకుని, వాటిని ఆ పార్టీలు జిఓఎం కు చెప్పాయి అని చెప్పుకోవడానికి అంటున్నారు. అంతే కాదు ఈ అఖిల పక్షం రాష్ట్రాన్ని విభజించాలా.. వద్దా... అనే అంశంపై కాదట, కేవలం ఎలా విభజించాలి అనేదానిపైనే అభిప్రాయాలు సేకరించడానికి అని కూడా అంటున్నారు. అందుకే టిడిపి ఇంకా దీనిపై స్పందించలేదు, కానీ వెళ్లనట్టే. వైఎస్సార్ సిపి మాత్రం ఇదంతా ఓఫార్స్, మేం హాజరుకాం అని చెప్పేసాయి. మిగిలి వారు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి