Loading...

3, ఫిబ్రవరి 2015, మంగళవారం

జాప్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళాకు అనూహ్య స్పందన

- పాత్రికేయుల నుండి వెల్లువెత్తిన దరఖాస్తులు 
- రహదారి భద్రత అందరి బాధ్యత  చ రవాణా శాఖ ఉప కమిషనర్‌ కృష్ణయ్య
విశాఖపట్నం, చైతన్యవారధి: రహదారి భద్రతను అందరూ బాధ్యతగా తీసుకోవాలని రవాణా శాఖ ఉప కమిషనర్‌ కృష్ణయ్య అన్నారు. జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ విశాఖ యూనిట్‌, రవాణా శాఖ సంయుక్తంగా మంగళవారం నిర్వహించిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళా సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రహదారి నిబంధనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించినపుడే ప్రమాదాలను నివారించుట సాధ్యపడుతుందని పేర్కొన్నారు. జర్నలిస్టులు సమాజానికి ఎంతో విలువైన వ్యక్తులని అన్నారు. సమాజ ప్రగతికి జర్నలిస్టులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కితాబిచ్చారు.
   జాప్‌ విశాఖ యూనిట్‌ రవాణా శాఖ సహకారంతో నిర్వహించిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళాకు పాత్రికేయుల నుండి అనూహ్య స్పందన లభించింది. మాధవధారలోని రవాణా శాఖ కార్యాలయంలో చేపట్టిన మేళాకు పాత్రికేయుల నుండి డ్రైవింగ్‌ లైసెన్సులు కోరుతూ దరఖాస్తులు వెల్లువెత్తాయి. జాప్‌ విశాఖ యూనిట్‌ అధ్యక్షులు ఎల్‌.జి. నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తమ అసోసియేషన్‌ పనిచేస్తుందని అన్నారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే జర్నలిస్టులలో లైసెన్సులు లేనివారి సౌకర్యార్థం ప్రత్యేక మేళాను నిర్వహించడం జరిగిందని తెలిపారు. రవాణా శాఖ అధికారులు అందించిన సంపూర్ణ సహకారానికి కృతజ్ఞతలు తెలియజేసారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను జర్నలిస్టుల సంక్షేమానికి చేపడతామని వెల్లడించారు. వీలైనంత త్వరగా డ్రైవింగ్‌ లైసెన్సులు మంజూరు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసారు. రవాణా శాఖ అధికారి ఖాన్‌ మాట్లాడుతూ 2004వ సం||లో జర్నలిస్టులకు ప్రత్యేక మేళా నిర్వహించి, లైసెన్సులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జర్నలిస్టులే మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. లీడర్‌ దిన పత్రిక సంపాదకులు రమణమూర్తి, జాప్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. యుగంధర్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు  పి.ఎ.ఆర్‌. పాత్రుడు మాట్లాడుతూ జర్నలిస్టులు పలు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారని అన్నారు. లైసెన్సు పొందక పోవడం వలన ప్రభుత్వ పరంగా, బీమా కంపెనీల నుండి రావలిసిన ప్రయోజనాలను కుటుంబాలు కోల్పోవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసారు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి జర్నలిస్టుకు లైసెన్సు అందజేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక మేళా నిర్వహించేందుకు నిర్ణయించామని తెలిపారు. అనంతరం రవాణాశాఖ ఇన్‌స్పెక్టర్‌ బుచ్చిరాజు రహదారి భద్రతపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి మురళి, జాప్‌ రాష్ట్ర నాయకులు కె.యం. నాయుడు, మాధవ్‌, నగర కార్యదర్శి కృష్ణారావు, ఉపాధ్యక్షులు డి. కాశీనాథ్‌, కోశాధికారి పి. దివాకర్‌, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి