Loading...

సంపాదకీయాలు

పారిశుద్ధ్యం పరిరక్షణకు చిత్తశుద్ధి ఏది?
చైతన్యవారధి: పారిశుద్ధ్యం పరిరక్షణ విషయంలో పాలకులు, అధికార్లు అలసత్వం చూపుతున్నారు. పారిశుద్ధ్య పరిరక్షణకు ఖర్చు చేస్తున్న నిధులకు, వస్తున్న ఫలితాలకు పొంతన ఉండటం లేదు. ఏ గ్రామ ముఖ ద్వార రోడ్లను చూసినా పారిశుద్ధ్యం విషయంలో పాలకుల నిబద్ధత ఏపాటిదో ఇట్టే అర్ధమవుతుంది.  రోడ్లు బహిరంగ మలముత్రాల విసర్జన, పేరుకుపోయిన చెత్త  చదారంతో దర్శనమిస్తాయి. గ్రామానికి ఏవరైనా నేతలు వచ్చినప్పుడో, ఏదైనా సభలు, సమావేశాలు నిర్వహించినప్పడు మాత్రమే రోడ్లును ఉడ్చి బ్లీచింగ్‌ జల్లుతున్నారు. మిగతా సమయాల్లో పట్టించుక్ను నాథుడే ఉండటం లేదు. అపారిశుద్ధ్య పరిస్థితులకు కారకాలైన మురుగునీరు నిర్వాహణ, కుక్కలు, పందుల నియంత్రణ, బహిరంగ మల విసర్జన నిర్మూలనపై దృష్టి సారించిన నాడే  గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్య పరిస్థితులు ఏర్పడతాయి. మురుగు నీరు నిర్వాహణకు సమర్ధవంతమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కాని పాలకులు చాలా చోట్ల ఈ విషయంపై శ్రద్ధ చూపిన దాఖలాలు కనిపించవు. అవసరమైన ప్రదేశాల్లో కాల్వలు నిర్మాణం చేపట్టడం లేదు. తమకు ఎక్కువ శాతం కమీషన్లు వచ్చే పనులుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నిధులను ఏదో విధంగా ఖర్చు చేయడానికి చూస్తున్నారు తప్ప సమస్య పరిష్కారానికి  తీసుకుంటున్న చర్యలు చాలా తక్కువనే చెప్పవచ్చు. కుక్కలు, పందుల నియంత్రణ చేస్తున్నప్పటికీ ఇవి కూడా అంతంత మాత్రమే. పారిశుద్ధ్య పరిరక్షణలో అత్యంత కీలకమైనది బహిరంగ మల విసర్జన. దీని నిర్మూలనకు వ్యక్తి గత మరుగు దొడ్లు నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. అయితే వ్యక్తి గత మరుగుదొడ్లు ఉన్నా గ్రామాల్లో వాటిని 95 శాతానికి పైగా ప్రజలు ఉపయోగించడం లేదు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు గ్రామాల్లో నిర్వహించిన పారిశుద్ధ్య అవగాహన సదస్సులు తూతూ మంత్రంగానే జరిగాయి. నేటికీ ప్రజలు మరుగుదొడ్లును ఉపయోగించటం లేదు. దీనికి ప్రధాన కారణం వీటిని ఏ విధంగా ఉపయోగించాలో ఎక్కువ మందికి తెలీదు. ఒక వేళ తెలిసినా విపరీతమై దుర్వాసన వస్తుందనే అభిప్రాయంతో ఉపయోగించడం లేదు. అదీ గాక వ్యక్తి గత మరుగుదొడ్లను ఉపయోగించడానికీ ఎక్కువ నీరు అవసరమవుతుందని,తాగడానికే నీరు దొరకనప్పడు మరుగుదొడ్లు ఉపయోగించడానికి నీరు ఎక్కడ నుంచి వస్తుందని చాలా మంది అంటున్నారు. ఈ ప్రాధిమికమైన అంశాలపై  దృష్టి సారించి, ప్రజలకు అవగాహన కల్పిస్తే చాలా మంది వ్యక్తిగత మరుగుదొడ్లను ఉపయోగించే అవకాశం ఉంది. వ్యక్తి గత మరుగుదొడ్ల వినియోగం పెరిగిన కొద్ది బహిరంగ మల విసర్జన తగ్గి చాలా వరకు పారిశుద్ధ్య సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే ప్రజల్లో ఈ విషయమై అవగాహన తీసుకు రావడంలో  అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదు. పారిశుద్ధ్యంతోనే  ప్రజల ఆరోగ్యం ముడిపడి ఉంది. కాబట్టి ప్రజా ప్రతినిధులు, అధికార్లు పారిశుద్ధ్య పరిరక్షణకు నిబద్ధతతో పని చెయ్యాల్సి ఉంది. ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉంది. గ్రామాల్లో ఉన్న పెద్దలు, యువకులు, యువజన సంఘాలు, మహిళా, పోదుపు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పారిశుద్ధ్య పరిరక్షణకు పూనుకోవాల్సి ఉంది. మురుగు నీరు వాడకాన్ని తగ్గించే విధంగా స్థానికుల్లో అవగాహన తీసుకు రావాలి. చెత్తా చదారాన్ని రోడ్లపై వేయకుండా వారికి వివరించాలి. మరుగుదొడ్లును వినియోగించే విధంగా అవగాహన కల్పించాలి. ముందుగా వీరు పారిశుద్ధ్య పరిరక్షణకు పై అంశాలపై అవగాహన పెంపొందించుకొని ఆచరించాలి. గ్రామంలో ఆరోగ్య వంతమైన వాతావరణం నిర్మించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చెయ్యాల్సి ఉంది.

విద్యాలయాల్లో సౌకర్యాలు కల్పించాలి
చైతన్యవారధి: ఈ విద్యా సంవత్సరం దాదాపు ముగిసింది. విద్యాలయాలకు సెలవులు కూడా ప్రకటిస్తున్నారు. ఈ సెలవుల్లో విద్యాలయాల్లో ఆదనపు వసతులు కల్పనకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రయివేటు విద్యాలయాలకు దీటుగా సర్కారు విద్యాలయాల్లో సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా విద్యను సజావుగా అభ్యసించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది.  నేటికీ పక్కా భవనాలు లేని విద్యాలయాలు చాలా ఉన్నాయి. పక్కా భవనాలు లేని చోట భవనాలను నిర్మించాల్సి ఉంది. మరుగుదొడ్లు లేని చోట మరుగుదొడ్లును నిర్మించాలి. తాగు  నీటి సమస్యను పరిష్కరించేందుకు పక్కాగా చర్యలు చేపట్టాలి. ఉన్న వసతులకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. చాలా ప్రాధిమిక పాఠశాలలకు విద్యుత్‌ కనక్షన్‌లు లేవు. ఈ పాఠశాలలలో టి.వి.లు ఉన్నా, వాటిని బోధనకు ఉపయోగించటం లేదు. విద్యుత్‌ కనక్షన్‌ ఉంటే వీటిని విద్యా బోధనకు ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠశాలలకు విద్యుత్‌ కనక్షన్లు ఏర్పాటుకు కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాల్సి ఉంది. రానున్న విద్యా సంవత్సరంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలి. నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. దీనికి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన సూచనలు, సలహాలు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అందజేయాలి. స్థానిక సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్లి వాటి పరిష్కారానికి  కృషి చెయ్యాలి. ఇది అంతా తమ  బాధ్యతగా భావించాలి.

సెలవులను సద్వినియోగం చేసుకోవాలి
చైతన్యవారధి: ఇంటర్మీడియట్‌, పదవ తరగతి, డీగ్రీ పరీక్షలు ఒకటోకటిగా ముగిశాయి. కళాశాలలకు, ఉన్నత పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు.   జూన్‌ వరకు రెండు నెలల పాటు ఈ సెలవులు ఉంటాయి. విద్యార్థులు ఏడాది పాటు  తరగతి గదుల్లో కూర్చొని పుస్తకాలతో కుస్తీలు పట్టి ఆలసి పోయి ఉంటారు.  ఈ ఆలసట, ఒత్తిడి నుంచి బయట పడటానికి విద్యార్థులు సెలవుల్లో సేద తీరడం అవసరమే. అయితే సెలవుల్లో రోజు  మొత్తాన్ని ఆట, పాటలతో గడిపి వృథా చేస్తే తర్వాత వ్యద చెందక తప్పదు. నేటి పోటీ ప్రపంచంలో ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు పలు రంగాల్లో వెనుక బడి ఉంటున్నారు. ముఖ్యంగా తెలుగు మాద్యమంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకోవడంలో వెనుకబడుతున్నారు. ప్రస్థుత పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వార్షిక విద్యార్హతలతో పాటు అదనపు నైపుణ్యాలు సంపాధించుకోవడం అవసరం. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికైనా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంగ్లీషు ప్లూయెన్సీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరమవుతున్నాయి. గ్రామీణ విద్యార్థులు ఈ సెలవులును సద్వీనియోగం చేసుకుని ఈ అంశాలలో నైపుణ్యాన్ని సంపాదించుకుంటే భవిష్యత్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సులభంగా చేజిక్కించుకోవచ్చు. విద్యార్థులు ఆ దిశగా ఆలోచించి అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి చర్యలు తీసుకోవాలి.

జాతి నిర్మాణంలో భాగస్వాములను చెయ్యాలి
చైతన్యవారధి: మనుషుల్లో రోజు రోజుకూ  అత్యాశ, అసూయ, అసహనం, స్వార్ధం హింసాత్మక ధోరణి పెరిగిపోతోంది. ఇది సమాజాన్ని  దుర్భర పరిస్థితులకు చేరువచేస్తోంది. దీంతో తరువాత తరాల వారు జాతి నిర్మాణంలో చేయి కలపాల్సింది పోయి తిరోగమనం దిశగా ప్రయణిస్తూ నైతికంగా పతనమౌతున్నారు. ఈ పరిస్థితిని అధికమించాలంటే చిన్నప్పుడే  మనిషిలో విలువలకు విలువనిచ్చే గుణాన్ని పెంపొందించాలి. మొక్కలుగా ఉన్నప్పుడే వారిని సమాజ పునర్నిర్మాణం వైపు దృష్టి సారించేలా, సంఘానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలి. సమాజపరమైన అవగాహన కల్పించాలి. తరువాత తరాలను మేలుకొలుపే విధంగా వారిని తయారు చెయ్యాలి. సమాజంలో తమ బాధ్యతలు, హక్కులను వివరించాలి. సమాజంలో ఏ విధంగా మెలగాలో వీరికి చెప్పాలి.  ఒక విషయాన్ని నేర్చుకోవడం ఎలా? ఏ విధంగా ఆలోచించాలి? అయోమయ పరిస్థితి నుంచి బయటపడటమెలా? ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి? ఎవరైనా బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంటుంటే  ఎలా స్పందించాలి? ఆపదలు వస్తే తప్పించుకొనే మార్గాలేమిటి వంటి విషయ పరిజ్ఞానాన్ని వారికి అందించాలి.  జాతి నిర్మాణంలో కీలక పాత్ర వహించే  నిష్ణాతులుగా వారిని తయారు  చెయ్యాలి. దీనికి వారిని  శారీరకంగా, మానసికంగా సిద్ధం చెయ్యాలి.  నైతిక విలువలు, ప్రవర్తన, లక్ష్యాల ఆవశ్యకతను వివరించాలి. వీరిలో  పోరాట పటిమను, సృజనాత్మకతను పెంపొందించాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, అందివచ్చిన అవకాశాన్ని జీవితానికనుగుణంగా మలచుకోవడం నేర్పాలి. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం, నిర్ణయాలను తీసుకోవడం, బాధ్యతను భుజాలకెత్తుకోవడం, ఒత్తిడిని భరించి విజయంతో ముందుకు సాగడం ఎలాగో వారికి అనుభవంలోకి తేవాలి. సమాజసేవ, ఆధ్యాత్మిక జీవిత ఆవశ్యకతను అనుభవపూర్వకంగా తెలియజేయాలి. అప్పుడే మానవ సమాజం పది కాలాల పాటు సుఖ శాంతులతో వర్థిల్లుతుంది. దీనికి తల్లిదండ్రులు,  ఉపాధ్యాయులు, విద్యావంతులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు ప్రయత్నం చెయ్యాలి. దీనికి కొంత సమయాన్ని కేటాయించాల్సి ఉంది. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాల్సి ఉంది.

యువకులను భాగస్వాములను చెయ్యాలి

చైతన్యవారధి: మనుషుల్లో రోజు రోజుకూ  అత్యాశ, అసూయ, అసహనం, స్వార్ధం హింసాత్మక ధోరణి పెరిగిపోతోంది. ఇది సమాజాన్ని  దుర్భర పరిస్థితులకు చేరువచేస్తోంది. దీంతో తరువాత తరాల వారు జాతి నిర్మాణంలో చేయి కలపాల్సింది పోయి తిరోగమనం దిశగా ప్రయణిస్తూ నైతికంగా పతనమౌతున్నారు. ఈ పరిస్థితిని అధికమించాలంటే చిన్నప్పుడే  మనిషిలో విలువలకు విలువనిచ్చే గుణాన్ని పెంపొందించాలి. మొక్కలుగా ఉన్నప్పుడే వారిని సమాజ పునర్నిర్మాణం వైపు దృష్టి సారించేలా, సంఘానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలి. సమాజపరమైన అవగాహన కల్పించాలి. తరువాత తరాలను మేలుకొలుపే విధంగా వారిని తయారు చెయ్యాలి. సమాజంలో తమ బాధ్యతలు, హక్కులను వివరించాలి. సమాజంలో ఏ విధంగా మెలగాలో వీరికి చెప్పాలి.  ఒక విషయాన్ని నేర్చుకోవడం ఎలా? ఏ విధంగా ఆలోచించాలి? అయోమయ పరిస్థితి నుంచి బయటపడటమెలా? ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి? ఎవరైనా బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంటుంటే  ఎలా స్పందించాలి? ఆపదలు వస్తే తప్పించుకొనే మార్గాలేమిటి వంటి విషయ పరిజ్ఞానాన్ని వారికి అందించాలి.  జాతి నిర్మాణంలో కీలక పాత్ర వహించే  నిష్ణాతులుగా వారిని తయారు  చెయ్యాలి. దీనికి వారిని  శారీరకంగా, మానసికంగా సిద్ధం చెయ్యాలి.  నైతిక విలువలు, ప్రవర్తన, లక్ష్యాల ఆవశ్యకతను వివరించాలి. వీరిలో  పోరాట పటిమను, సృజనాత్మకతను పెంపొందించాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, అందివచ్చిన అవకాశాన్ని జీవితానికనుగుణంగా మలచుకోవడం నేర్పాలి. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం, నిర్ణయాలను తీసుకోవడం, బాధ్యతను భుజాలకెత్తుకోవడం, ఒత్తిడిని భరించి విజయంతో ముందుకు సాగడం ఎలాగో వారికి అనుభవంలోకి తేవాలి. సమాజసేవ, ఆధ్యాత్మిక జీవిత ఆవశ్యకతను అనుభవపూర్వకంగా తెలియజేయాలి. అప్పుడే మానవ సమాజం పది కాలాల పాటు సుఖ శాంతులతో వర్థిల్లుతుంది. దీనికి తల్లిదండ్రులు,  ఉపాధ్యాయులు, విద్యావంతులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు ప్రయత్నం చెయ్యాలి.

నాకెందుకులే... మరి ఏవరికి కావాలి...
చైతన్యవారధి: ప్రస్తుతం సమాజంలో నాకెందుకులే అనే ధోరణి రోజు రోజుకు పెరిగి పోతోంది.  చెడు చూడకు, చేయకు, మాట్లాడకు, మధ్యపానం, అహింస మాని, నీతి నియమాలతో బతకమన్న  గాంధీగారి సూచనలను...పెడ చెవిన పెడుతున్నారు. సాటి వారికి సాయపడవోయ్‌... అన్న గురజాడ వారి సూక్తులను...గాలికి వదిలేస్తున్నారు. తన కళ్ల ఎదురుగా అన్యాయం జరిగినా, జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఎక్కువ మంది  నేను, నా వళ్లు అనే గిరి గీసుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఏమైనా, వారికి ఏం జరిగినా స్పందించటం లేదు. కొంత మంది తమవి మాత్రమే సమస్యలుగా భావిస్తున్నారు. ఇంకోంత మంది ఇతరుల సమస్యలలో తల దూర్చి లేని పోని కష్టాలకు గురవడమెందుకు అన్న భావనతో ఉంటున్నారు. ఈ  భావన సమాజాన్ని  దుర్భర పరిస్థితులకు చేరువచేస్తోంది.   దీంతో సమాజంలో అవినీతి పరులు, అసాంఘింక శక్తుల చీకటి పనులు పెరిగి పోతున్నాయి.  మన రాజ్యాంగం కల్పించిన హక్కులు, సూచించిన  బాధ్యతలపై ఎక్కువ మందికి అవగాహన లేక పోవడమే ఈ భావనకు కారణమవుతోంది. చాలా మందికి మన చట్టాలు, రాజ్యాంగ వ్యవస్తలుపై అవగాహన ఉండటం లేదు. ప్రజలంతా చైతన్యవంతులైనప్పుడే,  నీతి నియమాలతో, పరస్పర సహాకారం, సహాజీవనంతో సమాజంలో ప్రజలంతా మసలుకున్నప్పుడే భావి తరాలకు ఉన్నతమైన భావాలు, ఆదర్శాలు గల సమాజాన్ని అందజేయగలము. దీనికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ ఉన్నతంగా జీవించే సమాజ రూపకల్పనకు నడుం బిగించాల్సి ఉంది.

  
దుర్వినియోగమవుతున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం
చైతన్య వారధి సంపాదకీయం(23.07.2009) షెడ్యూల్ కులాలు,తెగల ప్రజలు సమాజంలో గౌరవంగా బతక టానికి, అగ్రవర్ణాలు, ఇతరులనుంచి అవమానాలు ఎదురుకాకుండా చూడటానికి తీసుకు వచ్చిన ప్రివెన్షన్ ఆప్ అట్రాసిటిస్ చట్టం తరచూ దుర్వినియోగమవుతోంది. తాజాగా విజయవాడలో పత్రికా ప్రతినిధులపై అక్రమంగా ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఈ చట్టం వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరటం పక్కనబెడితే మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోంది. మంచి చేద్దామని పెట్టిన చట్టం, కొంత మంది చేసే దుర్వినియోగం వల్ల ఉపయోగపడక పోగా, ఎవరికి అయితే ఉపయోగపడాలో వాళ్లకే చేటు తెస్తుంది. 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారత రాజ్యాంగంలో పొందుపర్చిన 366 అధికరణంలోని 24,25 క్లాజుల ఆధారంగా 11 సెప్టెంబర్ 1989 న ఈ చట్టం రూపొందింది. ఈచట్టంలోని సెక్షన్-3 ప్రకారం షెడ్యూల్ కులాలు,తెగల వారిని దూషించటం,సంఘ బహిష్కరణ, లైంగిక వేధింపులు, చిన్నచూపు చూడటం,దాడులకు పాల్పడటం మొదలగు 14 రకాల నేరాలు ఈ చట్టం క్రిందకు వస్తాయి. నాన్ బెయిలబుల్ కేసు నమోదుతో పాటు, నేరం రుజువైతే 6నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా విధించే వీలుంది. ఇప్పటి వరకు ఈ చట్టం కింద నమోదైన కేసులను పరిశీలిస్తే రాజకీయ కారణాలతో అకారణంగా ప్రత్యర్దులపై ఈ చట్టం క్రింధ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన దాఖలాలు అత్యధికం. పనిచేసి పెట్టడం లేదని ప్రభుత్వోద్యోగులపై, తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని జర్నలిస్టులపై ఇటీవలి కాలంలో ఈ చట్టం కింద ఎక్కువగా కేసులు పెడుతున్నారు. ఈ చట్టం కింద కేసు పెడితే ముందుగా బెయిల్ (యాంటీసీపేటర్) దొరికే పరిస్ధితి లేకపోవటం వల్ల నిందితులకు రాజీ తప్ప మరో మార్గం లేదు. ఈ చట్టం వల్ల ఎంతో మంది ప్రభుత్వోద్యోగులు అరెస్టయి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఈ చట్టం పేరు చెబితేనే జర్నలిస్టులు, వ్యాపారులు హడలి పోతున్నారు. అప్పు తీసుకుని అడిగితే కులం పేరుతో తిట్టాడని కేసులు పెడుతుండటంతో వ్యాపారులు వీరికి అప్పు ఇవ్వటమే మానివేశారు. కొద్ది మంది చేష్టలవల్ల మొత్తం జాతి ఇబ్బందుల పాలయ్యే పరిస్ధితి. పెట్టిన ఈ కేసులన్నీ న్యాయస్ధానాల్లో నిలబడలేకపోతున్నాయి.శిక్షకు ముందే నిందితుదు రిమాండ్ ఖైదీగా నెలరోజులపాటు జైల్లో ఉండే పరిస్ధితి. వంద మంది నేరస్తులు తప్పించుకున్న పరవాలేదు. ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్నది న్యాయ సూత్రం. ఏ నేరం చేయని వ్యక్తిని , సంఘంలో పేరు ప్రఖ్యాతులున్నవారిని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో జైల్లో తోస్తే ఆ తర్వాత సమాజంపై అతని ముద్ర నెగిటివ్ ధోరణిలో ఉండదా? 20 యేళ్ళ క్రితం పరిస్ధితులు నేడు లేవు. అంటరానితనం తగ్గింది.ఎస్సీ,ఎస్టీలు గౌరవమైన జీవనం సాగిస్తున్నారు. అలాంటప్పుదు చట్టాన్ని మార్పు చేయకుండా యదాతధంగా అమలు చేయటం ఓట్ల రాజకీయమే. అట్రాసిటి చట్టం కింద నమోదైన కేసులలో పోలీసుల విచారణ సరిగా ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. డీఎస్పీ స్తాయి అధికారి ఈ కేసులను విచారణ చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదులో ఇచ్చిన సాక్షులను విచారించి చేతులు దులుపు కుంటున్నారు.చాలావరకు బోగస్ కేసులే .తనపై కేసు నమోదు అయ్యిందని పోలీసులు చెప్పేవరకు నిందితుడికి తెలియదు.సంఘటన ఎప్పుడు,ఎక్కడ జరిగిందో కేసు ఎవరు పెట్టారోతెలియని బోగస్ కేసులే అధికం. నలుగురు సాక్షులుంటే చాలు ఏ స్ధాయి వారి మీదనైన కేసు పెట్టవచ్చు.హత్య కేసులో కూడా అడ్వాన్సుగా బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. ఎస్సీ,ఎస్టి యాక్టు కేసుల్లో జైలు గదప తొక్కనిదే బయటపడలేని పరిస్ధితి. ఏ మనిషి ఏ మనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించినా శిక్షించాల్సిందే. ఒక అమానుషాన్ని నిరోధించడం కోసం ఇంకో అమానుష చట్టం చెయ్యడం వివేకవంతమనిపించుకోదు. వ్యక్తి స్వేచ్చకు,పత్రికా స్వేచ్చకు, సమాజంలో జీవించే స్వేచ్చకు ఇబ్బందికరంగా తయారైన ఈ చట్టాన్ని సవరించి మార్పులు తీసుకురావాలి. లేని పక్షంలో సమాజంలో పౌరులందరికీ కలిపి సమగ్రమైన అత్యాచార నిరోధక చట్టం రూపోందించాల్సిన అవసరం ఉంది


ఇష్టపడితే ఈజీయే...

అనునిత్యం మనం అనేక పనుల్ని చేస్తుంటాం.. వాటిలో కొన్ని పనుల్ని చేసేటప్పుడు చాలా ఆనందాన్ని పొందుతుంటాం, కొన్నింటిని విధిలేక ఈసురోమంటూ ఎలాగో పూర్తి చేస్తాం. నచ్చని పనుల్ని చేసేటప్పుడు శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో వత్తిడికి లోనవుతుంటాం…. ఆనందంగా చేసే పనులు మాత్రం అప్పుడే పూర్తయిందా అన్నంత హుషారుతో నిర్వర్తించడం జరుగుతుంది. ఒకే పని, ఇలా వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అనుభవాలను ఎందుకు మిగుల్చుతోంది అన్నది ఆ పనిని వారు స్వీకరించే మానసిక స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే.. స్వతహాగా మీకు నచ్చకపోయినా… చేసే పని పట్ల ఇష్టాన్ని పెంచుకుని చేస్తే అది భారంగా ఉండకపోగా అంతకు ముందెన్నడూ ఆ పనిలో రుచి చూడని సంతృప్తిని మిగుల్చుతుందన్నది నగ్న సత్యం. అంటే ఇక్కడ మనం ఏవేవి ఇష్టాలు అనుకుంటున్నామో అవన్నీ మన మనసులో గిరిగీసుకు కూర్చున్న తాత్కాలికమైన పరిమితులు అన్న విషయం అర్ధమవుతుంది. ఆ పరిమితులు, పరిధుల్ని చెరిపివేస్తే ప్రతీదీ ఆనందం అందించేదే... ప్రతీ పనీ సులభమైనదే! ఉద్యోగంలో చేరిన కొత్తలో ఎవరైనా చాలా ఉత్సాహంగా, తానొక్కడే ఆ సంస్థని నడిపిస్తున్నంత శక్తివంతంగా పనిచేస్తారు. కాలం గడిచేకొద్దీ వృత్తి పట్ల నిరాసక్త ఆరంభమవుతుంది. ఎప్పుడైతే నిరాసక్తత ఏర్పడిందో అంతకుముందు క్షణాల్లో పూర్తయ్యే పనిని పూర్తి చెయ్యడానికి సైతం మానసికంగానూ, శారీరకంగానూ ఎంతో కష్టపడి చేయాల్సి వస్తుంటుంది. చాలామంది… శ్రమించి శ్రమించీ తాము శారీరకంగా, మానసికంగా అలసిపోయామని భావిస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఇష్టమైన పనిని చేసేటప్పుడు ఎప్పుడూ శరీరం , మనస్సు అలసిపోవు.అవలీలగా ఆ పనులు పూర్తవుతాయి. మారుతుందల్లా ఆ వృత్తి పట్ల, మనం చేసే పనుల పట్ల మనకు గల దృక్పధమే. ఎంత కష్టపడ్డా గుర్తింపు రావడం లేదనో, ఆర్ధికంగా ఎదుగుదల లేదనో. ఇతరత్రా కారణాల వల్లనో మనకు మనం మనల్ని పోషిస్తున్న వృత్తుల పట్ల నిరాసక్తతని పెంచుకుంటున్నాం. ఎప్పుడైతే ఇంత చేస్తున్నా ఏమీ ప్రయోజనం చేకూరడం లేదన్న ప్రతిఫలాపేక్ష మనసుని కమ్ముకుంటుందో అప్పుడు చేసే ప్రతీ పనీ ఎదో రూపేణా ప్రయోజనం ఉన్నదే చేయాలన్న స్వార్ధం జడలు విప్పుతుంది. దీనితో పనిపట్ల అంకితభావం, ఆనందం కొరవడుతుంది. దీంతో పనే భారం అవుతుంది. పనే భారమైతే కొన్నాళ్ళకు మనకు మనమే భారమవుతాము. చేసే పనినే దైవంగా స్వీకరించి దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడంలోనే ఆనందాన్ని పొందగలిగే మానసిక స్థాయిని పొందినప్పుడే మన పనులు మనకు భారం కావు. మన మనస్సు ఎప్పుడూ ఆనందంతో , సంతృప్తితో నిండి వుంటుంది


మాట జారితే అంతే...

"మాట" ఎంతో శక్తివంతమైనది. ఒకే మాట వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు అర్ధాలను ధ్వనిస్తుంటుంది. మనం మాట్లాడే మాటని ఎదుటివారికి ఇష్టమైన అర్ధంతో ధ్వనింప చేయలేకపోతే ఆ మాట నిస్సారమైనట్లే లెక్క. స్నేహాలు, శత్రుత్వాలు, నమ్మకాలు, సందేహాలు, ఇష్టాలు, నిష్టూరాలు, ప్రేమలు, ఏహ్యాలు వంటి భావోధ్వేగాలన్నీ మన మాటల ద్వారానే సృష్టింపబడుతూ ఊంటాయి. ఏ వ్యక్తితో ఎలా ప్రవర్తించాలన్నది మన మనసులో ముందే ప్రోగ్రామ్  చేసుకుని ఉంటాము. అయితే అలా ప్రవర్తించేటప్పుడు మాటల్లొ హెచ్చుతగ్గులు ఒక్కోసారి విపరీత పరిణామాలకు దారి తీస్తుంటాయి. వాక్కుపై నియంత్రణ కలిగిన వ్యక్తి ప్రపంచాన్ని జయించినట్లే అంటుంటారు. అందుకే పరిణతి కలిగినవారెప్పుడు గంభీరంగా, గుంభనంగా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే  ఆచీ తూచి మాట్లాడుతూంటారు.తాము మాట్లాడిన మాటలు ఎలాంటి ఫలితాలు అందిస్తాయో అంచనా వేయగలుగుతారు.తాము ప్లాన్డ్ గా మాట్లాడడమే  కాకుండా ఎదుటివ్యక్తుల మాటల ఆధారంగా  వారి మనసుల్ని అవలీలగా చదివేయగలుగుతారు. మనం మాట్లాడే మాటకు మొహంలో కన్పించే భావం జీవాన్ని పోస్తుంది. మాట సున్నితమైనా భావం కఠినంగా గోచరిస్తే మాత్రం ఫలితం తారుమారవడం ఖాయం. మాటనీ, భావాన్నీ సమన్వయపరచుకుని ఒకేలా ధ్వనింప చేయగలిగితే అవి ఎదుటి వ్యక్తుల మనసుల్ని హత్తుకు పోతాయి. మాటలపై నియంత్రణ కోల్పోతే ఎన్నో అనుబంధాలను కోల్పోవలసి వస్తూంది. అందుకే  వీలైనంతవరకూ మన నోటి నుండి వెలువడే ధ్వనిపై  ఓ కన్నేసి ఉంచి నిబద్ధతతో మాట్లాడడం అన్ని విధాలా శ్రేయస్కరం !


ఇప్పటికి ఇదే కరెక్టు...
నిన్నటి తరానికి, నేటి తరానికి ఆలోచనా విధానంలో గానీ, వ్యవహార శైలిలో గానీ, జీవితం పట్ల ఉన్న దృక్ఫధంలో గానీ, ఎంత వృత్యాసం! ముందు తరం లక్ష్యాలు పరిమితంగా ఉండేవి. అవకాశాలూ ఆ స్థాయిలోనే ఉండేవి. పెళ్ళి చేసుకుని , నాలుగురాళ్ళు సంపాదించుకోవడం,  హాయిగా కాలం గడపడం వరకే దాదాపు వారి ఆలోచనలు లిమిట్ అవుతాయి. నేడో.. జీవితంలో సాధించవలసిన లక్ష్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అప్పటితరం ’ఫీల్ గుడ్’ గా ఏ ఆర్ధిక ఉన్నతిని భావించేదో అంతకన్నా పదిరెట్లు సంపాదించినా కోరికలను తీర్చుకోలేనంత కన్ష్యూమబుల్స్ ప్రస్తుతం మార్కెట్లో వెల్లువెత్తుతున్నాయి. ఏ కోరికనీ అణచుకోలేని ప్రస్తుత తరం వాటన్నింటినీ చేజిక్కించుకోవడానికి కాలంతో పాటు పరుగులు పెడుతోంది. అప్పటి తరం, ఇప్పటి తరం తాము ఆనందం అనుకునే దానిలో ఆనందాన్ని పొందుతూనే ఉన్నారు. అయితే అభిరుచులు, ముందున్న అవకాశాల్లోనే వృత్యాసం ఉంది. ఫ్రెండ్స్ తో జాలీగా వీకెండ్స్ గడిపే కుర్రాళ్ళని మునుపటి తరం మందలిస్తుంటుంది.. అలా తిరిగితే చెడిపోతారు.  అనేది అప్పటి అనుభవాలు వారికి నేర్పిన పాఠం. అందుకే వారు తమకు అపసవ్యంగా అనిపించిన పిల్లల ధోరణుల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే యువతలో తాము వేలెత్తి చూపించే అంశాలుగా భావించిన వాటిని వేలెత్తి చూపుతున్నారు కాని తమ రోజులతో పోలిస్తే తమ పిల్లలు ప్రస్తుతం చూపిస్తున్న ప్రతిభాపాటవాల్ని చాలా తక్కువమందే గుర్తిస్తున్నారు. మునుపటి తరం చదువుకునేటప్పుడు కెరీర్ గురించి తమ పెద్దల వద్ద ప్రస్తావించాలన్నా భయపడేవారు. మరి ఇప్పటి పిల్లలు తమ లక్ష్యాలను నిర్భయంగా పెద్దలతో పంచుకోవడంతోపాటు వాటిని నెరవేర్చుకోవడానికి కావలసిన వనరులను, సమాచారాన్ని సైతం ఎవరి సాయం లేకుండా సమకూర్చుకుంటున్నారు కాబట్టి అప్పట్లో తమలో నాటుకుపోయిన ముద్రని ఇప్పటి తరంపై రుద్దడం పెద్దలకు ఏ మాత్రం భావ్యం కాదు...


ద్వేషం వీడి సాయపడవోయ్...
ద్వేషం,... మనిషిని అధఃపాతాళానికి తీసుకెళ్లే భాయంకరమైన గుణం ఇది. మనుషుల మధ్య బంధాలు పలుచనవుతూ ఆర్ధిక, సామాజికపరమైన అగాధాలు పెరుగుతున్న తరుణంలో ప్రేమ స్థానంలో ద్వేషం మనల్ని నిలువునా దహించివేస్తుంది. నిన్న మొన్నటి వరకూ అరమరికలు లేకుండా కలిసి గడిపిన వ్యక్తులు, కుటుంబాలు వృత్తి వ్యాపారాల్లో తలమునకలై సామాజికంగా కొంత దూరం అవగానే వారి ఆర్ధికపరమైన హోదాలు, స్థితిగతులు ఒక్కొక్కరి మనసుల్ని తొలవడం సర్వసాధారణమైపోయింది. ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంతెత్తు ఎదిగిపోతున్నారు అన్నదే ప్రధానమైపోతుంది. అంతకాలం మనిషిని అభిమానించిన మనసు కాస్తా డబ్బు పొడ చూపగానే ద్వేషించడం మొదలెడుతుంది. "అందరికన్నా ఎక్కువ సంపాదించాలి. అందరికన్నా వీలుపడకపోయినా ఫలానా వారి కన్నా ఉన్నతంగా ఉండాలి".. ఇదే యావ ఎక్కడ చూసినా మనుషుల్లో ! అయిన వారిని, కావలసిన వారిని ఆర్ధికంగా కొలవడమేమిటో?..!! ఎంత గొప్ప అనుబంధాలు ఈ అనారోగ్యకరమైన పోటీకి పుటుక్కున తెగిపోతున్నాయి? నువ్వు సంపాదించుకో బాగుండు.. ఎవరూ కాదనరు. కాని నిన్నటి వరకు ప్రాణానికి ప్రాణమైన వ్యక్తులతో, కుటుంబాలతో నీకు పోటీ ఏమిటీ? నీకన్నా వారు నాలుగురాళ్లు ఎక్కువ సంపాదిస్తే జీవితం మొత్తం కోల్పోయినంత అసంతృప్తి ఎందుకు?  అస్సలు కావలసిన మనిషిని ఎందుకు ద్వేషించాలి? ఎందుకంటే... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం కోసం మనం మనుషుల్ని, మనసుల్ని పోగొట్టుకుంటూ సంపాదనలోనే ముఖాన్ని విప్పార్చుకుంటున్నాం. ఒకప్పుడు ఓ వారం రోజులు కన్పించకపోతే బెంగపడిపోయిన మిత్రుడు ఈరోజు ఆర్నెల్ల తర్వాత ఆత్మీయంగా పలకరిద్దామని వస్తే... "ఇప్పుడు వీడెక్కడ తగిలాడురా దేవుడా.. టైమ్ వేస్ట్" అనుకుంటూ చిటపటలాడే మొహంపై చిరునవ్వులు పులుముకుని ఏడవలేక నవ్వుతున్నాం. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్ప. ఆ గొప్ప మనకే చెందాలి. మనకన్నా ఎక్కువ సంపాదించి ఇంకెవరూ, చివరకు మనవాళ్లయినా ఎదిగిపోకూడదు. అలా జరిగితే వెంటనే ద్వేషం తన్నుకొస్తుంది. ఎదిగిపోతున్నాం.. చితికి సరిపడా నోట్ల కట్టలను పేర్చుకోగలిగేటంతగా!! చితికిపోతున్నాం.. ఒక్కటంటే ఒక్కటన్నా మనసైన బంధాన్ని మిగుల్చుకోలేక!! ఈ నెగిటివ్ ఎమోషన్స్ మనల్ని ఆవహించి నిరంతరం అసంతృప్తికి లోనుచేస్తూ అర్ధం పర్ధంలేని అపార్థాలతో మనుషుల్ని దూరం చేస్తున్నాయి. ఎవరితో ఎలా ఉంటే ఎంత లాభమా అని దేబిరించుకుని లెక్కలు కట్టుకుంటున్నాం. లాభం లేనిదే ఏ పనీ చెయ్యం. లోపల మాత్రం ద్వేషం మనసుని కుళ్లబెట్టి చెయ్యవలసిన నష్టం చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఆ ఇనపచట్రంలో నుండి బయటకొచ్చి బంధాలను పెనవేసుకుంటే ఆ ఊహే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా...

    
ప్రకృతిని ఆస్వాదించండి...
ఉదయాన్నే లేలేత భానుడి కిరణాల స్పర్శ తనువంతా ఎంత ఉత్తేజం నింపుతుందో కదా! అలసిన శరీరాన్ని, మనసుని నిన్నటి రేయి తన మాయాజాలంతో మటుమాయం చేస్తే.. కొంగొత్త ఉత్సాహం నరనరానా నిండేలా సూర్యోదయం అందించే అనుభూతిని వర్ణించడానికి మాటలు తమ వల్ల కాదంటూ చేతులెత్తేయవూ..? వెన్నెల రాత్రులూ స్పందించే హృదయాలను ఎంత మైమరిపింపజేస్తాయో కదా! కలత చెందిన మనసూ, అలా వెన్నెల వైపు చూస్తే క్షణాల్లో స్వాంతన లభించడం కొందరికి అనుభవైకవేద్యమే. అంతెందుకు పూలకుండీలో విచ్చుకున్న గులాబీ కూడా మనకోసమే ఎదురు చూస్తున్నట్లు చిరునవ్వుతో పలకరిస్తుంటే అదేమీ పట్టనట్లు సాగిపోతే ఆ బాధతో అది ముడుచుకుపోదూ..? గుబురుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని చూడండి... అవి ఏ రకంగానూ మనకు ఉపయోగపడకపోయినా తమ పచ్చదనంతో మనలో ఆశల్ని చిగురిస్తాయి. ప్రకృతి ఎప్పుడూ మనల్ని వెన్నంటే ఉంటోంది... కానీ దాన్ని ఆస్వాదించగలిగే రసహృదయమే మనిషిలో కొరవడుతోంది. జీవితంతో పోరాడడానికి మనసుని రాయిచేసుకుని సహజస్పందనలను నిర్ధాక్షిణ్యంగా తొక్కిపెట్టే మనకు ప్రకృతి గురించి ఆలోచించే తీరికెక్కడిది. మన బాధలను, బడలికలను ఉపశమింపజేయడానికి అది స్నేహహస్తం దాచినా అందుకునే మనసెక్కడుంది మనలో! ఇరుకు గదుల్లో, ఏసి చల్లదనానికి అలవాటు పడిన ప్రాణం శీతాకాలపు సహజసిద్ధమైన చల్లదనంలో ఉన్న స్వచ్ఛతని ఎక్కడ గుర్తించగలుగుతుంది? జీవించడానికి, జీవితంలో మన ఉనికిని నిలబెట్టుకోవడానికి పరిగెడుతున్నాం మనం! ఆ హడావుడిలో ప్రకృతిని ఆస్వాదించగలిగే తీరుబడి కూడానా! అలా కుండీ నుండి పరిమళాలను వెదజల్లే మల్లె వాసనల్ని ఆఘ్రాణించవచ్చునన్న ఆలోచనే మనకెప్పుడూ కలగదు. పచ్చదనాన్ని నింపుతూ అల్లుకున్న మనీప్లాంట్ ని చూడమంటే .. "ఇంకేం పనిలేదా" అని మొహం చిట్లించుకుని మన పనిలో పడిపోయే బాపతు మనం! ఇంకెక్కడి రసాస్వాదన? ఈ ప్రకృతి మన కోసమే, మనతో మమేకమై ఉంది. ఈ బిజీ జీవితాల్లో దాని విలువని మనం గుర్తించలేకపోతున్నాం. ఇంటి ముందు చిన్నపాటి గార్డెన్ ఉన్నా దాన్ని పెకలించి మరో గది వేసి ధనార్జన చేద్దామన్న స్వార్ధం మనల్ని కమ్ముకుంటోంది. మనకు ఆహ్లాదం పంచడానికే పచ్చదనాన్ని కప్పుకుని సింగారించుకునే మొక్కలే కాదు సూర్యోదయపు కిరణాల స్పర్శా, చంద్రుడి వెన్నెలా.. చల్లదనంతో గమ్మత్తైన అనుభూతిని కలిగించే మంచుబిందువులు, వర్షపు చినుకులూ.. కిలకిలమంటూ పలకరించే పిట్టలూ, ఏవీ మనల్ని కదిలించలేకపోతున్నాయి. మన చుట్టూ అదో ప్రపంచం ఉందన్న విషయమే ఎప్పుడో బాల్యంలోనే మర్చిపోయాం. మన పలకరింపు కోసం ఆర్తితో చూసే ప్రకృతిని ఆస్వాదిస్తే బాగుంటుంది కదా!    


    
గొప్పవారికి కొమ్ములు ఉంటాయా?
టి.వి. స్క్రీన్‌పై ఓ మహోన్నత వ్యక్తి జీవిత విశేషాలు వ్యాఖ్యాత డ్రమెటిక్‌గా చెప్పుకుంటూ పోతుంటే.. "ఎంత గొప్పవారో కదా" అని మైమరిచిపోయి ఆస్వాదిస్తుంటాం. అలా చూస్తూనే అంతర్లీనంగా మన జీవితాన్ని తలుచుకుని కించిత్ బాధా పడిపోతాం. "ఆ స్థాయికి ఎదగాలంటే రాసి పెట్టి ఉండాలి.." అన్న భావము పెదాలను దాటకుండా మనసులో బందీగా ఆగిపోతుంది. మనమూ కష్టపడదాం, మనమెందుకు అలా పేరు తెచ్చుకోకూడదు" అని ఓ వైపు మనసు లాగుతున్నా.. "పేరు తెచ్చుకోవడం కోసం, గొప్పవారిమవడం కోసం అంత కష్టపడాలా" అంటూ తర్కం మరో వైపు తన బద్ధకపు నైజాన్ని బయట పెడుతుంటుంది. స్పూర్థిదాయకమైన వ్యక్తుల గురించి చూసేటప్పుడు, చదివేటప్పుడు, వినేటప్పుడు వారు ప్రస్తుతం ఉన్న స్థాయికి ఇచ్చినంత ప్రాముఖ్యత వారి జీవితంలోని ఎత్తు పల్లాలకు ఇవ్వం. ఒకవేళ ఇచ్చినా అన్ని ఎత్తుపల్లాలు దాటుకుని రావడం మనవల్లేం అవుతుంది అని ఢీలా పడిపోతాం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది సాక్షాత్కారం అవడానికి నెలలు పట్టవచ్చు. కొండొకచొ జీవితమే సరిపోకపోవచ్చు. లక్ష్యసాధన వైపు మనం సాగించే ప్రయాణాన్ని ప్రేమించాలి కాని,, లక్ష్యాన్ని పగటి కలలు కంటూ ప్రయాణాన్ని విస్మరించి "ఏం చేసినా కలిసి రావట్లేదు" అంటూ నిస్పృహలో కూరుకుపోకూడదు. "జీవితంలో మీ లక్ష్యమేమిటి?" అని ఎవర్ని ప్రశ్నించినా.. ఆ పని అయితే చాలు, ఈ పని అయితే చాలు అంటూ పిట్ట కోరికలు చెబుతుంటారు. అస్సలు అవి జీవితపు లక్ష్యాలేంటో అర్ధం కాదు. ఎవరినీ కించపరచడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. మనమేం కావాలనుకుంటున్నామో, ఏం సాధించాలనుకుంటున్నామో ఇలా చిన్న చిన్న బౌండరీలు గీసుకుని మనమే ఇరుకుల్లో మగ్గిపోతుంటే.. టి.వి ల్లో, పేపర్లలో కనిపించేటంత గొప్పవారిగా ఎప్పటికి అవుతాం? అస్సలు మనమెందుకు విస్తృతంగా ఆలోచించకూడదు? అందరూ చెప్పేదే అయినా మరోమారు నా మనసులో బలీయంగా ఉన్న ఫీలింగ్‌ని చెబుతున్నాను. గొప్పవారికి కొమ్ములు లేవు. వారేం దేవతాపుత్రులు కాదు. మనలాగే ఎన్నో కష్టాలను ఈదుకుంటూ వచ్చారు. ఈరోజు మనకు మీడియాలో వారి ముఖాలపై కనిపించే సంతృప్తి వెనుక ప్రలోభపెట్టే ఆనందాలను త్యజించి గడిచివచ్చిన జీవితపు గురుతులు దాగి ఉంటాయి. కానీ మనకు ఈ క్షణం మంచి తిండి, మంచి నిద్ర, సుఖాల వంటి లౌకిక విషయాల ద్వారా వచ్చే సంతృప్తి ముఖ్యమనుకుంటాం. ఏదైనా సాధించాలనుకునేవారు లక్ష్య సాధనలొ ఎదురయ్యే అనుభవాల నుండి సంతృప్తిని మూటగట్టుకుంటూ ప్రయాణం సాగిస్తుంటారు. రొటీన్ తిండి, నిద్ర, సుఖాలతో కొన్నాళ్లకు మనకు జీవితం బోర్ కొడుతుంది. నిరంతరం తమని తాము నగిషీలు చెక్కుకుంటూ ఉండడం వల్ల వారి జీవితం కొంగొత్త ఉత్సాహంతో తళతళలాడుతుంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలనే ప్రజ్ఞ మనం కలిగి ఉండడంతో పాటు ముందు తరాలకు అందించవలసిన బాధ్యత మనదే. లేదంటే స్టీరియో్‌ఫోనిక్

ప్రతిదానికీ పోలిక దేనికీ?
విచిత్రమేమిటో కాని ఒక విజయం లభిస్తే.. ఆ విజయం అందించే మాధుర్యం కన్నా విఫలమైన వారితో పోల్చుకోవడం ద్వారా పొందే ఆనందమే ఎక్కువ ఉంటుంది మనకు. ఏదైనా వైఫల్యం ఎదురైనా అంతే.. వైఫల్యం చిన్నదే అయినా ఇతరులతో పోల్చుకుని కుళ్ళి కుళ్ళి దుంఖపడితే కానీ ఊరట పొందదు మనసు ! ప్రతీ దానికీ ఇతరులతొ పోల్చుకోవడం ద్వారా భావోద్వేగాలను ఆస్వాదించగలిగే అదృష్టం చాలామంది కోల్పోతుంటారు. దాంతో అసలైన సంఘటన మిగిల్చిన అనుభూతులు చెరిగి పోల్చుకోవడం ద్వారా మనసులో పాతుకుపోయే సంకుచిత భావాలు ఆధిపత్యం చలాయిస్తుంటాయి. ఇవి క్రమేపీ మన వ్యక్తిత్వాన్ని పతనం చేస్త్తుంటాయి. ఏ ఒడిదుడుకులూ లేనంత కాలం "నేనే రాజుని" అంటుంది మన బుద్ధి. చూసే చూపులోనూ, నడిచే నడకలోనూ, మాటలోనూ మిడిసిపాటు కనిపిస్తూనే ఉంటుంది. ఎవర్నీ లెక్కచేయం ! మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లు పురుగుల కన్నా హీనంగా కన్పిస్తుంటారు. కన్పించిన ప్రతీ వాళ్లకీ వెధవ సలహాలు ఇవ్వడమే.. ఏదో కారణ జన్ములమైనట్లు ! అంతలో అనుభవించిన భోగాలు చాలు కానీ కాస్త ఈ హాట్ రుచి కూడా రుచి చూడు నరుడా" అంటూ కొన్ని కష్టాలు మనపై కుమ్మరిస్తాడు భగవంతుడు. కష్టం అలా తలుపు తట్టిందో లేదో "చూశావా కొద్దిగా జాగ్రత్తగా ఉండమంటే ఉన్నావా, చూడు ఇపుడు ఏం జరిగిందో" అంటూ బుద్ధి తన తప్పేమీ లేనట్లు మనల్ని నిందించడం మొదలు పెడుతుంది. అంతటితో ఆగకుండా" అయినా ఈ ప్రపంచంలో ఎక్కడ లేని కష్టాలన్నీ నీకే రావాలా..? ఆ ప్రక్కనున్న వెంకటరావుని చూడూ , ఎలా హాయిగా ఉన్నాడో ! నువ్వే ఇలా పడి ఏడవాల్సి వస్తోంది. ఇక నీ జన్మ వ్యర్ధం. ఏ నీళ్ళులేని నూతిలోనో పడి చావరాదూ" అంటూ నిరంతరం మనసుతో యుద్ధం చేస్తుంటుంది తప్పుడు బుద్ధి. ఇలా డ్రామా వేషగాళ్ళ మాదిరిగా లోపల కష్టాలు దాచుకుని పైకి నవ్వుతూ కన్పించే ప్రతీ ఒక్కరినీ వారెంతో ఆనందంతో ఉన్నారని నిరంతరం పోల్చుకుంటూ మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది అదే బుద్ధి. ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు సుఖాలు అనుభవిస్తున్న వారితో పోల్చుకుంటూ చివరకు మనం రెండింటినీ సమానంగా స్వీకరించగలిగే స్థితప్రజ్ఞతని కోల్పోతాం. ఒక్కసారి కష్టాల్లో ఉన్నప్పుడు మనకన్నా పీకల్లోతు కష్టాల్లో ఉన్నవారిని తలుచుకోండి. ఎంత మెరుగైన స్థితిలో ఉన్నామన్న ధైర్యం కలుగుతుందో ? అదే సుఖాలనుభవించేటప్పుడు మనకంటే కోట్ల రెట్లు ఉన్నతంగా ఉన్న ఏ బిల్‍గేట్స్ తోనో పోల్చి చూడండి. కనీసం మనం సాధించింది అణుమాత్రమైనా ఉందేమో అర్ధమవుతుంది. మీ విజయాలను, వైఫల్యాలను ఇతరులతో పోల్చుకోనిదే నిద్రపట్టనపుడు ఆ పోల్చుకునే విధానాన్నయినా ఇలా పాజిటివ్‍గా చేయండి !.

అన్నీ జీవిత గమనంలో మజిలీలే !
కాలమెప్పుడు మన పక్షానే ఉండదు. ప్రతీ జీవితంలోనూ కొన్ని గడ్డురోజులంటూ
రావడం ఖాయం ! ఎంత శ్రమించినా ఎదురుదెబ్బలు తగలడం, మన పరిధిలో
లేని, మనం నియంత్రించలేని అనేక అంశాలు మనల్ని శాసించడం సహజం.
ఓ అపజయమో, అనారోగ్యమో, నష్టమో, కష్టమో వచ్చిందంటే చాలు...
అప్పటివరకూ మనకి ఎంతో గౌరవం ఇచ్చిన సమాజం కూడా ప్రతీ చిన్న
విషయాన్నీ వేలెత్తి చూపడానికి ఉత్సుకత చూపిస్తుంది. అసలే నిండా
ఇబ్బందుల్లో ఉన్న మన ఆత్మస్థైర్యాన్ని సమాజంలోని వ్యక్తుల ప్రవర్తన
మరింత దెబ్బ తీస్తుంది. అంతటి క్లిష్టతర పరిస్థితుల్ని ఎదుర్కోవడం ప్రతి ఒక్కరి
వల్లా కాదు. కష్టాలన్నీ తాత్కాలికమేనని మన మనసుకి మనం సర్ది చెప్పుకుంటూ,
మరో ప్రక్క సమాజం చూపించే చులకన భావాన్ని తట్టుకుంటూ సమాజం
చులకనగా చూసినంత మాత్రాన మనం వైఫల్యం చెందలేదని మనో నిబ్బరంగా
నిరంతరం బేలన్స్ చేసుకోవడం ఎంతో కష్టమైన వ్యవహారం. ఏదీ శాశ్వతం కాదు.
కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పుడు సమాజం చూపించిన గౌరవం, మనం సంపాదించిన
డబ్బు, అనుభవించిన భోగం.. కష్టాలతో వచ్చే నిష్టూరాలు, నష్టాలు, అశాంతి
అన్నీ జీవిత గమనంలో మజిలీలే ! భౌతికపరమైన అంశాలకు ఎప్పుడైతే
ప్రాధాన్యత తగ్గించి ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తామో, ఆత్మశక్తి
అంటూ ప్రతీ శరీరంలోనూ ఒకటుంటుందని.. దానికి కలిగే ఆనందమే
సర్వోత్కృష్టమైనదని గ్రహించగలుగుతాం. అప్పుడు ప్రతీ కష్టాన్నీ, ఆనందాన్నీ
ఒకే రకమైన చిరుమందహాసంతో స్వీకరించగలుగుతాము.

ధూమపాన నిషేధం అమలేదీ?

ధూమపాన నిషేధం అమలు కాగితాలకే పరిమితమైంది. ఈ చట్టం ద్వారా ఇప్పటి వరకు  చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. ధూమపాననిషేధం అమలుకు జారీ చేసిన ఆదేశాలను పట్టించుకొన్న నాథుడు లేడు. గత ఏడాది అక్టోబర్‌ రెండో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ధూమపాననిషేధం విధించారు. ప్రభుత్వ ఉత్తర్వలకు అనుగుణంగా సుప్రీంకోర్టు స్పందించింది. దీంతో ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, సినిమా థియేటర్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల, కోర్టు ఆవరణం, పాఠశాలలు, కళాశాలలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించారు. పిల్లలకు పొగాకు ఉత్పత్తులను అమ్మినా, కళాశాలలు, పాఠశాలలకు 300 గజాల దూరంలోపు పొగాకు అమ్మినా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే కళాశాలలు, పాఠశాలకు దగ్గరల్లోనే అనేక షాపుల్లో పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బహిరంగ ప్రదేశాల్లో దూమపానం చేస్తే రూ.200 రూపాయలు జరిమానా చెల్లించాల్సిందే. అనేక మార్లు కేసులు నమోదైతే 10 వేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఆయా ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో సంబంధిత అధికారులు కేసులు నమోదు చేయాల్సి ఉంది. ధూమపానం చేసేవారిపై కేసులు నమోదు చేసేందుకు వివిధ రకాలైన టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఇవి
అమలుకు నోచకోవడం లేదు. చట్టాలు చేస్తే సరిపోదు వాటి అమలుకు చిత్త శుద్ధితో పని చేసినపుడే వాటికి సార్ధకత చేకూరుతుంది.