Loading...

మహిళా వారధి

వద్దుబాబోయ్ అమెరికా అల్లుడు...

మహిళావారధి: రావుగారి పెద్దమ్మాయికి అమెరికా సంబంధం చేశారంట... ఆ అమ్మాయిది ఎంత అదృష్టం... కష్టమైనా కట్నకానుకలు భారీగానే అందించారంట... కుర్రాడు కూడా బాగానే ఉన్నాడు.. ఆ అమ్మాయి మహర్జాతకురాలు... మేము కూడా మా చిన్నమ్మాయిని అమెరికా అల్లుడికే ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాం... ఇదీ ఒకప్పుడు పెళ్లి సంబంధాల ఊసు వచ్చినపుడు ఎక్కువగా వినిపించే మాట. ఇప్పుడు సీన్‌ రివ ర్స్‌ అయ్యింది. అమెరికా సంబంధమా.. అయితే వద్దు అంటున్నారు. అమెరికా సంబంధం అంటే ఒక స్టేటస్‌ సింబల్‌గా ఉండేది. లక్షల్లో జీతాలు, ఖరీదైన జీవితం, అమ్మాయి సుఖపడుతుందనే ఉద్దేశ్యంతో ఆస్తులను తెగనమ్ముకుని అయినా తల్లిదండ్రులు సిద్ధపడేవారు. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రుల ఆలోచనా విధానం లో మార్పు వచ్చింది. దేశం కాని దేశంలో అమ్మాయిని ఎలా చూసుకుంటారో? అని వెనుకంజ వేస్తున్నారు. అమెరికాలో ఖరీదైన జీవితానికి అలవాటుపడిన కొం తమంది కట్న వేధింపులకు గురిచేస్తున్న సంఘటనలు తల్లిదండ్రులను ఆలోచింపజేస్తున్నాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో అమెరికా అబ్బాయిలు తమ దృష్టిని పల్లెలపై పెడుతున్నారు. కోట్లలో కట్నాలు డిమాండ్‌ చేసే అమెరికా అబ్బాయిలు ప్రస్తుతం ఇచ్చినంత కట్నంతో సరిపెట్టుకుంటున్నారు. ఇండియాలో కూడా పెద్దపెద్ద సంస్థలు భారీగా జీతాలు ఇస్తుండడంతో ఇక్కడ వివాహాలకే అమ్మాయిల తల్లిదండ్రులు ప్రాధాన్యమిస్తున్నారు.
 ----------------------------------------------------------------

గర్భాలపై ఆహారపు అలవాట్ల ప్రభావం

మహిళావారధి: ఆహారపు అలవాట్లలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల ప్రభావం గర్భస్థ పిండాలపై పడుతోందని తాజా ఆధ్యయనాలు చెబుతున్నాయి.  కొన్ని ఆహారపు అలవాట్లు మాతాశిశు సంక్షేమంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా కృత్రిమంగా తయారు చేస్తున్న ఆహార పదార్ధాలు, పానీయాలు తల్లీ బిడ్డల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు కలుగజేస్తున్నాయి. తాజాగా డెన్మార్క్‌లో నెలలు నిండకుండా పిల్లలు పుట్టడానికి గల కారణాలపై పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా కృత్రిమ తీపిదనాన్ని కలిగించిన శీతల పానీయాలను సేవించే మహిళల్లో నెలలు నిండకుండానే శిశు జననాలు సంభవిస్తుండటాన్ని చూసిన వారు ఆశ్చర్య పోయారు. అందువల్ల గర్భిణులైన మహిళలు తప్పనిసరిగా కృత్రిమ తీపిదనాన్ని కలిపిన శీతల పానీయాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కృత్రిమ తీపిదనాన్ని కలిగిన శీతల పానీయాలకు గర్భిణులు దూరంగా ఉండక తప్పదు. డెన్మార్క్‌లో మొత్తం 60 వేల మంది గర్భిణీ స్ర్తిలను డాక్టర్లు పరీక్షించారు. ముఖ్యంగా కృత్రిమ తీపిదనాన్ని కలిగించే శీతలపానీయాలను ఎక్కువగా తాగే వారిపై దృష్టి కేంద్రీకరించారు. రోజుకు కనీసం ఒక్కసారి అటువంటి శీతల పానీయం తాగేవారిలో నెలలు నిండని పిల్లలు పుట్టే అవకాశాలు 38 శాతం వరకు ఉన్నాయి. అదే రోజుకు నాలుగు సార్లు శీతల పానీయాలను తాగే వారిలో 78శాతం వరకు పిల్లలు నెలలు నిండకుండానే జన్మించే అవకాశాలు అధికం. కృత్రిమంగా తియ్యదనాన్నికలిగివున్న పదార్ధాలు, శరీరంలోపల అనేక రసాయన చర్యలకు లోనయి, క్రమంగా గర్భస్థ పిండంపై ప్రభావాన్ని చూపుతాయని డాక్టర్లు చెబుతున్నారు. డెన్మార్క్‌లోని స్టేటెన్స్ సిరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన థోరహార్లర్ హల్డర్‌సన్ ఈ పరిశోధనలు నిర్వహించారు.
 -------------------------------------------------------

నారింజతో అదం... ఆరోగ్యం...

"ఆరెంజ్‌ క్లాటస్‌ ఆరంటమ్‌" అనే శాస్త్రీయ నామం కలిగిన నారింజ పండ్లు చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్‌, సంస్కృతంలో "నారంగ-ఐరావతి", హిందీలో "నారంగీ, సంతరా", బంగ్లాలో "కమలా రేఖ" అనే పేర్లతో పిలుస్తుంటారు.
నారింజ పండు కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది. ముదిరిన నారింజ కాయలను కోసి, ఉప్పులో ఊరబెట్టి, ఎండబెట్టి, కారం మరియు మెంతిపొడి కలుపుకున్నట్లయితే... ఊరగాయలా నిల్వ ఉంటుంది. రుచిగా ఉండటమే కాక, ఆరోగ్యాన్ని కూడా వృద్ది పరుస్తుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు... నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే, ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు కలదు.  నారింజలో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే కాల్షియం.. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది.  విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరి చేరవు. రోజూ పరగడుపున ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగితే, మార్నింగ్ సిక్‌నెస్‌నుండి సులభంగా బయటపడవచ్చు.  గర్భవతులు రోజూ ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగినట్లయితే.. ఫోలిక్‌యాసిడ్ సంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నారింజ తొక్కను పడేయకుండా... ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే... చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది.